Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Thursday, July 25, 2013

1వథెస్సలొనీకయులకు2వఅధ్యాయము

1  సహోదరులారా, మీయొద్ద మా ప్రవేశము వ్యర్థముకాలేదు గాని. 
2  మీరెరిగినట్టే మేము ఫిలిప్పయిలో ముందు శ్రమపడి అవమానముపొంది, యెంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవునియందు ధైర్యము తెచ్చుకొంటిమని మీకు తెలియును. 
3  ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు గాని 
4  సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులని దేవునివలన ఎంచబడినవారమై, మనుష్యులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టువారమై బోధించుచున్నాము. 
5  మీరెరిగియున్నట్టు మేము ఇచ్చకపు మాటలనైనను, ధనాపేక్షనుకప్పిపెట్టు వేషమునైనను ఎన్నడును వినియోగింపలేదు; ఇందుకు దేవుడే సాక్షి. 
6  మరియు మేము క్రీస్తుయొక్క అపొస్తలులమైయున్నందున అధికారము చేయుటకు సమర్థులమైయున్నను, మీవలననే గాని యితరులవలననే గాని మనుష్యులవలన కలుగు ఘనతను మేము కోరలేదు. 
7  అయితే స్తన్యమిచ్చు తల్లి తన స్వంత బిడ్డలను గారవించునట్లుగా మేము మీ మధ్యను సాధువులమైయుంటిమి. 
8  మీరు మాకు బహు ప్రియులైయుంటిరి గనుక మీయందు విశేషాపేక్షగలవారమై దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణములనుకూడ మీకిచ్చుటకు సిద్ధపడియుంటిమి. 
9  అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకమున్నది గదా. మేము మీలో ఎవనికైనను భారముగా ఉండకూడదని దివారాత్రము కష్టముచేసి జీవనముచేయుచు మీకు దేవుని సువార్త ప్రకటించితిమి. 
10  మేము విశ్వాసులైన మీయెదుట ఎంత భక్తిగాను, నీతిగాను, అనింద్యముగాను ప్రవర్తించితిమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి. 
11-12. తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనురీతిగా మీలో ప్రతివానియెడల మేము నడుచుకొంటిమని మీకు తెలియును. 
13  ఆ హేతువుచేతను మీరు దేవునిగూర్చిన వర్తమానవాక్యము మావలన అంగీకరించినప్పుడు, మనుష్యుల వాక్యమని యెంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. 
14  అవును సహోదరులారా, మీరు యూదైయలో క్రీస్తుయేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకొనినవారైతిరి. వారు యూదులవలన అనుభవించినట్టి శ్రమలే మీరును మీ స్వదేశస్థులవలన అనుభవించితిరి. 
15-16. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడు సంపూర్తిచేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి, అన్యజనులు రక్షణపొందుటకై వారితో మేము మాటలాడకుండ మమ్మును ఆటంకపరచుచు, దేవునికి ఇష్టులుకానివారును మనుష్యులకందరికి విరోధులునై యున్నారు; దేవుని ఉగ్రత తుదముట్ట వారిమీదికి వచ్చెను. 
17  సహోదరులారా, మేము శరీరమునుబట్టి కొద్దికాలము మిమ్మును ఎడబాసియున్నను, మనస్సునుబట్టి మీ దగ్గెర ఉండి మిగుల అపేక్షతో మీ ముఖముచూడవలెనని మరి ఎక్కువగా ప్రయత్నముచేసితిమి. 
18  కాబట్టి మేము మీయొద్దకు రావలెనని యుంటిమి; పౌలను నేను పలుమారు రావలెనని యుంటిని గాని సాతాను మమ్మును అభ్యంతరపరచెను. 
19  ఏలయనగా మా నిరీక్షణయైనను ఆనందమైనను అతిశయకిరీటమైనను ఏది? మన ప్రభువైన యేసు ఆగమన సమయమున ఆయన యెదుట మీరే గదా. 
20  నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై యున్నారు. 
         Download Audio File

No comments:

Post a Comment